Monday, April 13, 2009

ఉబ్బసం తో బాధ పడేవారికి

ఉబ్బసం తో బాధ పడేవారికి ఒక మంచి "మన అమ్మ" చిట్కా.. రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు (ఇలాచి)ను, దంచి లోపలి గింజలను తినాలి. అంతే ఇక ఆ రాత్రి ఉబ్బసం మిమ్మల్నిబాధించదు

గ్యాస్ స్టవ్ మీద జిడ్డు పోవటం లేదా..!!

మీ గ్యాస్ స్టవ్ మీద, అరుగు మీద నూనె అంటి, ఎంత కడిగినా కూడా పోవటం లేదా..!! ఐతే మీకోసం ఒక "మన అమ్మ" చిట్కా..!! కొద్దిగా బియ్యంపిండి తీసుకొని స్టవ్ మీద, ఇంకా గ్యాస్ అరుగు మీద రుద్ది, మామూలుగా కడగండి.. జిడ్డు సులువుగా వదిలిపోతుంది.

డిన్నర్ ప్లేట్లపై పసుపు మరకలు పోవాలంటే !!

డిన్నర్ ప్లేట్లపై పసుపు మరకలు పోవాలంటే డిటర్జెంట్ సోప్తో పాటు గోధుమపిండి కలిపి రుద్దండి.అంతే..మీ డిన్నర్ ప్లేట్లు మళ్ళీ మామూలుగా తయారవుతాయి

Tuesday, March 17, 2009

అతిథిదేవో భవ ~:

అతిథి అనగా వారం, తిథి తో సంబధం లేకుండా భోజన సమయానికి వచ్చే ఎవరైనా, ఆఖరికి పురుగైనా అతిథి తో సమానం అని అర్థం. పూర్వకాలంలో అతిథి లేకుండా భోజనం చేసేవారే కాదు. అతిథికి భక్తితో కాళ్ళు కడిగి, భొజనం పెట్టి సేద తీర్చి సేవ చేసేవారు. ఈనాడు అటువంటి సాంప్రదాయం కనుమరుగైంది.ఆకలి తో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే అది ఒక యజ్ఞం తో సమానమని పెద్దలు చెబుతారు.తృప్తి అనేది, ఒక్క భోజనము తోటే వస్తుంది.ఎంత బంగారం, వస్త్రాలు ఇచ్చినా ఇంకా ఆశ తరగదు. అందుకే ఒక్క అన్నదానం లోనే "చాలు" అనే పదం వినగలము.ప్రతివారూ తమకు ఉన్న దాని లోనే నెలకు ఒక చిన్న మొత్తం గా దాచి అనాథ ఆశ్రమాలకు, బీద విద్యార్తుల, పోషణకు కొంత సాయం చేయవచ్చు. మనం ఎవరము గొప్ప సహాయాలు చేయలేకపోయినా చిన్నపాటి ధన సహాయమే అది వారికి ఎంతో వరమై వారి అభివృద్దికి తోడ్పడి మనకు ఎంతోతృప్తిని కలిగిస్తుంది.

ఆచార్య దేవో భవ ~:

"ఆచార్యుడు అనగా ఙ్ఞానమునిచ్చే గురువు అని అర్థము". సద్గురువునెలా పూజించాలో, సేవించాలో మనము తొలి పోస్ట్ లో కొంత తెలుసుకున్నాము. అంతేకాక మనకు ఙ్ఞానము తెలియ చేసే ప్రతీ వారిలో తమ గురువును చూడగలగాలి. గురువులోనే సర్వ దేవతలూ కొలువై ఉన్నారు.దీనికి నానుడిగా చిన్న ఉదాహరణ ఉన్నది. ఒక వ్యక్తి దగ్గరకు అతని గురువు , దైవము ఒకేసారి వచ్చారట. అతను ముందుగా గురువుకుసాష్టాంగవందనం చేసిన తరువాత, దైవానికి నమస్కారము చేశాడట...దీనిని బట్టి గురువేదైవం అని, స్పష్టంగా తెలుసుకోవచ్చు. పూర్వకాలం నుంచీ దేవతల అవతారాలెత్తిన శ్రీమహావిష్ణువు శ్రీక్రృష్ణ అవతారం లో సాందీపని, శ్రీరామ అవతారం లో వారి కుల గురువులైన వశిష్టులను, అస్త్ర విద్య నిచ్చిన శ్రీవిశ్వామిత్ర మహర్షిని సేవించిన సంగతి మనం తెలుసుకోవాలి. ఈ కలియుగంలో శ్రీరామ కృష్ణ పరమహంస "తోతాపురి" అనే గురువును, జగతికి హిందూమత విశిష్టతను తెలియచేసిన వివేకానందుడు శ్రీరామక్రిష్ణులను సేవించి, ముక్తి పథంవైపు పయనించిన సంగతి మనం గ్రహించి, ఆ మార్గంలో పయనించి పునీతులం కావాలి. అతిథిదేవోభవ గురించి తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో......

మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -4)

ధర్మ వ్యాధుడు బేరం ముగించి అంగడి కట్టివేసి కౌశికుని తో కలిసి తన ఇంటికి వెళ్ళాడు. కౌశికునికి కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు ఇచ్చి ముసలివారైన తన తల్లి తండ్రుల వద్దకు వెళ్ళి వారి యోగక్షేమములు విచారించి వారికి తానే స్వయంగా అన్నం తినిపించి, కాళ్ళు, చేతులు కడిగి పాదాలు వత్తి వారి సేవ చేసి, తరువాత మహర్షి కి తగిన ఉపచారాలు గావించి ఫలాలు సమర్పించి ఆ పిమ్మట తను భోజనం గావించాడు. కౌశికునితో "స్వామీ!! మీ సందేహం ఏమిటో అడుగవచ్చు అన్నాడు.కౌశికుడు ధర్మవ్యాధునితో, "నాయనా!! నీవు చూస్తే మాంసం విక్రయం చేస్తున్నావు..జీవనోపాధికి ఇంకేమైనా చేయవచ్చు కదా!! అన్నాడు.అందుకు ధర్మవ్యాధుడు "స్వామీ ఇది మా కులవృత్తి. ఎవరి కులవృత్తి వారికి దైవముతో సమానముగా భావించి జీవనయాత్ర గావించాలి.కనుకు ఇందులో నాకు పాపపుణ్యముల ప్రసక్తి రానే రాదు. నేను కులవృత్తిగా ఈ పని చేస్తున్నాను.ఎవరైనా సహాయం కోసం వస్తే, నా శక్తి కొలదీ పాత్రోచితంగా చేస్తున్నాను. ధర్మం ఎంతో సూక్ష్మమైనది, కఠినమైనది". అని కౌశికునికి ఎన్నో ధర్మసందేహాలకు సమాధానమిచ్చి సందేహ నివృత్తి గావించాడు.కౌశికుడు జన్మతః బ్రాహ్మణుడైనా మోక్షం కోరి, వృధ్డ్ధులైన తల్లి తండ్రులను వదిలి అడవులకు వెళ్ళాడు. కొడుకుగా తన బాధ్యతను విస్మరించిన వానిని దైవం మాత్రం ఎందుకు కరుణిస్తాడు. తన తప్పు తెలుసుకుని ధర్మవ్యాధునికి కృతఙ్ఞతలు తెలిపి, కౌశికుడు తన స్వధర్మం ఆచరించటానికి తన గ్రామం వెళ్ళి తల్లి తండ్రుల సేవలో తరించాడు. కనుక ప్రతివారూ ముందు తమ కర్తవ్యం తెలుసుకుని ఆచరించి అందరికీ ఆదర్శప్రాయులు కావాలి....కౌశికుని మాతృ, పితృ భక్తి అందరూ గుర్తుంచుకొని ఆచరించి తరించగలగాలి.

మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -3)

పాదాలమీద పడిన కౌశికుని చూసి "మహర్షీ ఈ శక్తి నాకు నా పతిభక్తి వలన లభించింది.నీవు కోరుకున్న ఙ్ఞానం కావాలంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళు" అని వినయము తో చెప్పింది.కౌశికుడు తన అహంకారము అంతా పోయి ఙ్ఞాన సముపార్జనకు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మ వ్యాధునికై వాకబు చేశాడు.దాని ప్రకారం వెళ్ళేసరికి ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తూ కనిపించాడు.అది చూసిన కొఉశికుడు తన మనసులో "ఇతను చూస్తే నీచమైన మాంస వృత్తిలో జీవిస్తున్నాడు..ఇతను తనకేం ధర్మం బోధించగలడు" అనుకున్నాడు.కౌశికుని చూడగానే, ధర్మ వ్యాధుడు "మహర్షీ! నమస్కారములు..ఆ తల్లి సుమతీ మాత పంపగా వచ్చారా??! కాసేపు వేచి ఉంటే ఈ పని ముగించుకొని వస్తానని పలికాడు. కౌశికుడు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనై, అక్కడ ఆ తల్లి, కాకి సంగతి చెప్పటం, ఇతనికి నా విషయం ముందే తెలియటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది" అనుకుంటూ వేచి చూడసాగాడు.