Tuesday, March 17, 2009

మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -4)

ధర్మ వ్యాధుడు బేరం ముగించి అంగడి కట్టివేసి కౌశికుని తో కలిసి తన ఇంటికి వెళ్ళాడు. కౌశికునికి కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు ఇచ్చి ముసలివారైన తన తల్లి తండ్రుల వద్దకు వెళ్ళి వారి యోగక్షేమములు విచారించి వారికి తానే స్వయంగా అన్నం తినిపించి, కాళ్ళు, చేతులు కడిగి పాదాలు వత్తి వారి సేవ చేసి, తరువాత మహర్షి కి తగిన ఉపచారాలు గావించి ఫలాలు సమర్పించి ఆ పిమ్మట తను భోజనం గావించాడు. కౌశికునితో "స్వామీ!! మీ సందేహం ఏమిటో అడుగవచ్చు అన్నాడు.కౌశికుడు ధర్మవ్యాధునితో, "నాయనా!! నీవు చూస్తే మాంసం విక్రయం చేస్తున్నావు..జీవనోపాధికి ఇంకేమైనా చేయవచ్చు కదా!! అన్నాడు.అందుకు ధర్మవ్యాధుడు "స్వామీ ఇది మా కులవృత్తి. ఎవరి కులవృత్తి వారికి దైవముతో సమానముగా భావించి జీవనయాత్ర గావించాలి.కనుకు ఇందులో నాకు పాపపుణ్యముల ప్రసక్తి రానే రాదు. నేను కులవృత్తిగా ఈ పని చేస్తున్నాను.ఎవరైనా సహాయం కోసం వస్తే, నా శక్తి కొలదీ పాత్రోచితంగా చేస్తున్నాను. ధర్మం ఎంతో సూక్ష్మమైనది, కఠినమైనది". అని కౌశికునికి ఎన్నో ధర్మసందేహాలకు సమాధానమిచ్చి సందేహ నివృత్తి గావించాడు.కౌశికుడు జన్మతః బ్రాహ్మణుడైనా మోక్షం కోరి, వృధ్డ్ధులైన తల్లి తండ్రులను వదిలి అడవులకు వెళ్ళాడు. కొడుకుగా తన బాధ్యతను విస్మరించిన వానిని దైవం మాత్రం ఎందుకు కరుణిస్తాడు. తన తప్పు తెలుసుకుని ధర్మవ్యాధునికి కృతఙ్ఞతలు తెలిపి, కౌశికుడు తన స్వధర్మం ఆచరించటానికి తన గ్రామం వెళ్ళి తల్లి తండ్రుల సేవలో తరించాడు. కనుక ప్రతివారూ ముందు తమ కర్తవ్యం తెలుసుకుని ఆచరించి అందరికీ ఆదర్శప్రాయులు కావాలి....కౌశికుని మాతృ, పితృ భక్తి అందరూ గుర్తుంచుకొని ఆచరించి తరించగలగాలి.

No comments:

Post a Comment