Sunday, December 21, 2008

తెలుగు ఆణిముత్యాలు - జీవన శైలి

మనకు మహాభారతం ఎన్నో విషయాలను తెలియ చెప్పింది.మనుషులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే విషయాలను ఈ ఇతిహాసమును నిశితముగా గమనిస్తే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి.మనం తోటివారి పట్ల ఎలా ఉండాలో "విదురుడు" ఒక శ్లోకం ద్వారా చక్కగా చెప్పారు.పరుల ఏ పనుల వల్ల మనకు బాధ, దుఃఖం కలుగుతాయో, తిరిగి మనము ఆ పనులను పరులకు చేయకుండా ఉండటమే పరమ ధర్మమని విదురుడు బోధించాడు. ఈ విషయాన్ని మనకు చక్కటి పద్య రూపంలో వివరముగా చెప్పారు.మరి ఆ పద్యాన్ని మనము కూడా నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పే ప్రయత్నం చేద్దాం..

"ఒరులేవి యొనరించిన

నరవర యప్రియము తనమనమునకు దా

నొరులకు నవిసేయ కునికి

పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్"


ఆణిముత్యంలాంటి ఈ పద్యం ప్రతివారు నేర్చుకుంటే, ఎదుటివారికి బాధ కలిగించే పనులు చేయకుండా ఉంటారు.కనుక ప్రతి తల్లి తమ పిల్లలకు చిన్న నాటి నుంచే ఇటువంటి మంచి విషయాలను నేర్పాలి.తద్వారా సమాజం కూడా బావుంటుంది.ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక , మంచి, విషయాలను తెలుసుకుందాం.. తదుపరి పోస్ట్ లో....


No comments:

Post a Comment